పేజీలు

20, ఏప్రిల్ 2010, మంగళవారం

గుర్తుకొస్తున్నావు!

గుర్తుకొస్తున్నావు.
బాగా గుర్తుకొస్తున్నావు.
నిన్ను మర్చిపోవాలనుకున్న కొద్దీ గుర్తుకు వస్తున్నావు.
అసలు గుర్తుకు రావడం ఏంటి? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడం అనేది ఉంటుంది. ఇది గుర్తుకు రావడం కాదు. మర్చిపోలేక పోవడం.
'అసలు నన్నెందుకు మర్చిపోవాలి?' అని నువ్వు నన్ను అడిగితే బాగుండు అనిపిస్తుంది. 'నన్ను ప్రేమిస్తున్నావా?' అనిఅడిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వేదీ అడగవు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నీ కోసం నా మనసు పడే బాధ నీకుఅర్థం కాక కాదు. అక్కర లేక. అందుకే విలవిల లాడుతున్న నన్ను చూస్తూ కూర్చుంటావు తప్ప ఏమైందని అడగవు. నేనూ చెప్పను. ఇది అహంకారం కాదు. నీ మీద ప్రేమే. నీకు అక్కరలేని వాటిని నిన్ను బతిమిలాడో, కన్వీన్స్ చేసో నీకుఎందుకు అంటగట్టాలి? నేనేమి సేల్స్ మాన్ని కాదు. ప్రేమికుడిని. నా ప్రేమ నీకు విలువైనదిగా అనిపించాలి. అరుదైనవరంలా అనిపించాలి. నీకు కావాలనిపించే అర్హతలు నేను పొందాలి. అపుడు నువ్వే అడుగుతావు. 'నన్నుప్రేమిస్తున్నావా?' అని.
అవన్నీ జరగాలంటే ముందు నిన్ను మర్చి పోవాలి. అందుకే ప్రయత్నం. నీకు తెలుసా? ఎవరో ఒక అనుభవశాలి ఇలాచెప్పాడు "సంతోషం అయినా ప్రేమ అయినా - మనం వాటి వెనకాల పరుగేత్తినంత కాలం దొరకవు. మనం ఆదమరపుగా ఉన్నపుడు సీతాకోక చిలుకలా మన భుజం మీదికి వచ్చి వాలతాయి.''
అందుకే నిన్ను నా మనసు దరి దాపుల్లోకి రానివ్వకూడదని అనుకుంటున్నాను. అయినా వదలవుగా నువ్వు. నీముఖంలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాననే భయం. అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకుంటాను. నీమాట వింటే మంత్రంలా నా మనసును కట్టిపడేస్తుందని భయం. నీకు దూరంగా ఉంటేనే నీ మాయ లోంచి నాకు విముక్తి. అందుకే దూరం ఇల్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దగ్గరవ్వాలని అనుకునేదాకా దూరంకొనసాగాలి. నా ప్రేమ సీతాకోక చిలుకవు నువ్వు. నీ అంతట నువ్వే నా మనసు తోటలోకి వచ్చి వాలాలి. అప్పటికి దాకానీ లోకంలో నువ్వు హాయిగా, స్వేచ్చగా ఉండు. నీ సుఖాన్ని కోరుకోవడం కంటే ప్రేమకు పరమార్థం ఏముంది చెప్పు! నీకోసం తపించడంలో నాకు ఆనందం ఉంది. నీకోసం కలవరించడంలో నాకు మనశ్శాంతి ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉండటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. అసలు నిన్ను కలవడం అన్నది నేను గర్విస్తోన్న విషయం. చూసావా! ఇలా రాస్తూ రాస్తూ మళ్ళీ నీ మాయలో పడి ఎక్కడికో వెళ్లిపోతున్నా. ఇదే ప్రేమ మహిమ. కాదు నీ మహిమ. నువ్వు కలవక పోతే అసలు నాలో ఈ ప్రేమ ఎలా పుట్టేది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి