పేజీలు

10, ఫిబ్రవరి 2011, గురువారం

నా సిమ్లా పర్యటన

డిల్లీ నుంచి అంబాలా వెళ్ళే ఒకటవ నంబరు జాతీయ రహదారిపై పానిపట్టు, కర్నాల్ లను దాటిన తర్వాత తానేసర్ కంటే ముందు పిప్లీ అన్న ఊరోస్తుంది. అక్కడ నుండి ఎడమకు తిరిగి 6 కి.మీ. లు లోపలికి వెళ్తే వస్తుంది కురుక్షేత్రం. కురుక్షేత్రం అన్నది హర్యానా రాష్ట్రంలోని ఒక జిల్లా కూడా. అక్కడికి వెళ్లకముందు హైవే మీదే ఉన్న ఒక ధాబా దగ్గర భోజనం చేసేందుకు ఆగాం.

అక్కడ నాన్వెజ్ దొరకడం చాలా తక్కువ. మా ప్రయాణం మొత్తంలో ఆలుగడ్డ కూర, రాజమ పప్పు, రొట్టెలతో కూడిన భోజనమే చేసాం. అక్కడ ఆలూ ఎక్కువగా పండుతుంది. కందిపప్పు , చింత పండు అసలు వాడరు. ఉల్లి, కీరా వంటి వెజిటబుల్ సలాడ్ ను ఇక్కడ మనకు ఫ్రీగానే ఇస్తారు. కాని అక్కడ ౩౦-40 రూపాయలు వసూలు చేస్తారు. చివరికి పెరుగు కావాలన్నా డబ్బులు పెట్టాల్సిందే. రైస్ దొరుకుతుంది కాని అన్ని చోట్ల ఉండదు. ఉన్నా ఆ లావాటి మెతుకులు తినడం కాస్త కష్టం. ఇక డ్రైవరుకు మనం ప్రత్యేకించి తినిపించానక్కర లేదు. దాబా లేదా హోటల్ వాళ్ళు వారికి ఉచితంగానే eపెడతారు. అయితే పాసెంజరు బిల్లులోనే ఆ చార్గీలను ఇరికించేందుకు చూస్తారు. మా మొదటి మజిలీలో అదే జరిగింది. eఅయితే బిల్లు చెక్ చేసుకోడంతో బయటపడి అడిగితే డ్రైవర్ తనే పే చేస్తానని బిల్డప్ ఇచ్చాడు. నిజానికి వాళ్ళ దగ్గర ఫ్రీ ఫుడ్డు, మన ఖాతాలో డబ్బులు రెండూ నొక్కే మాయాజాలం అన్నమాట. అందుకే ప్రైవేటు వాహనాల పై వెళ్ళేవారు ఇటువంటి మోసాల పట్ల అప్రమతంగా ఉండాలి. అలాగే డిస్టెన్స్ కూడా మజిలీ చేసిన ప్రతీ చోటా నోట్ చేసుకోవాలి. మనకూ ఏది ఎక్కడనుంచి ఎంత దూరం ఉందొ తెలుస్తుంది. మీటరు సరిగా ఉందొ లేదో కూడా తేలుతుంది. తేడా వచ్చి వాహనాన్ని వెనక్కు పంపాలన్నా రిటర్న్ కూడా ఇచ్చిపంపాలి. కాబట్టి ట్రావెల్స్ వాళ్ళ తో చాలా జాగ్రతగా వ్యవహరించాలి. ఇక మన టూర్ ఎలా జరుగుతుంది అనేది మనతో పాటు వచ్చే డ్రైవరును బట్టి, అతనితో మనం వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. రోజు వారీ బత్తా రెండొందలు ఇస్తున్నా , అప్పుడప్పుడూ కాస్త అతని కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో , ఈ టూర్ కు సంబంధించి చేసిన మొదటి భోజనం , కాబట్టి వెరైటీని బాగానే ఎంజాయ్ చేసాం.

ఉదయం 11 గంటలకు డిల్లీ నుంచి బయలుదేరిన మేము మద్యాహ్నం ౩ గంటలకు కురుక్షేత్రం చేరాం. కురుక్షేత్రం అనేది మహాభారత ఇతిహాసానికి సంబంధించిన ఘట్టాలను వివరించే అనేక ప్రదేశాలున్న ఒక క్షేత్రం. కురు అనే ఒక రాజు పేరుమీద ప్రస్సిద్ది గాంచిన ప్రాంతం. ఇక్కడ బ్రహ్మ సరోవర్, జ్యోతి సర్, భద్రకాళి టెంపుల్, స్తానేస్వర్ టెంపుల్ అనే అనేక గుడులు, తటాకాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. జ్యోతిసర్ అన్న చోట కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడంట. భీష్మ కుండ్ అన్న చోటే భీష్మ పితామహుడు అంపశయ్యపై పుణ్యకాలం కొరకు వేచి ఉన్నాడంట.

మొదట మేము బ్రహ్మ సరోవర్ అన్న చోటుకు వెళ్లాం. ఒక పెద్ద సరస్సు ఉందక్కడ. పక్కనే ఒక శివాలయం ఉంది. ఇక్కడ నుంచే బ్రహ్మ తన సృష్టిని మొదలు పెట్టాడంట. ఈ సరస్సులో అమావాస్య నాడు వచ్చే గ్రహణం రోజున, సూర్య గ్రహణం రోజున స్నానం చేస్తే పాపాలన్నీ తుడిచిపెట్టుకు పోవడంతో పాటు, అశ్వమేధ యాగం చేసినంత ఫలం సంప్రాప్తిస్తున్దంట. ఇక మిగిలిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళమంటే ఈ ప్రదేశాల గురించి నాకు తెలీదు, ఎవరైనా జీపు వాళ్ళని మాట్లాడనా? అని డ్రైవర్ అనేటప్పటికి మాకు నోట మాట రాలేదు. ఎవరినో మాట్లాడే దానికి ఇతనిని పెట్టుకున్నది ఎందుకు? అతనితో మొదటే తగవు పెట్టుకోవడం ఇష్టం లేక జీపు వాళ్ళని అడిగితే 600 రూపాయలు అడిగారు. అప్పటికే ఎండ వేడికి అలసి పోయి ఉండడం చేత , త్వరగా చండీఘర్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని ఉండటం చేత , అక్కడ నుండి బయలు దేరాం. ఈ రకంగా ఆదిలోనే హంస పాదు అన్న చందాన గీతోపదేశం జరిగిన ప్రదేశాన్ని చూడకుండానే వెనుతిరిగాం.

రాత్రి 7 గంటల సమయంలో చండీఘర్ చేరుకున్నాం.
(మిగతాది 'చండీఘర్ ' శీర్షికతో..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి