పేజీలు

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా సిమ్లా పర్యటన

('చండీఘర్' తర్వాత ...)

మా సిమ్లా పర్యటనలో మూడవ రోజు .
ఉదయం 6 గంటలకు చండీఘర్ నుండి ప్రైవేటు వాహనం (సిక్స్ సీటర్)లో సిమ్లాకు బయలుదేరాం. నిజానికి సిమ్లా వెళ్ళే వారంతా చండీఘర్ కు దాదాపు ౩౦ కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్కా రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ నుండి టాయ్ ట్రైన్ లో సిమ్లాకు వెళ్తారు. సుమారు ఆరు గంటల పాటు టన్నెల్స్ , బ్రిడ్జిలు, కొండ మలుపులు, లోయలు , ఎతుపల్లాలు మద్య సాగే ఈ ప్రయాణం అద్భుతంగా ఉంటుందని అంటారంతా. మేముకూడా ట్రైన్లోనే వెళ్దామనుకున్నాం కాని మేము బుక్ చేసుకున్న టిక్కట్లు కన్ఫర్మ్ కాలేదు. అదీగాక ట్రైన్ ఉదయాన్నే బయలుదేరుతుంది. అంటే ముందు రోజు రాత్రికే కల్కా చేరుకోవాలి. అందుకని టాటా టవేరాలో రోడ్డు ప్రయాణానికి సిద్ధమయ్యాం.

హిమాలయాలలోని శివాలిక్ పర్వత శ్రేణిలో ఉంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. చండీఘర్ దాటిన తర్వాత 22 వ నెంబర్ జాతీయ రహదారిపై సాగుతుంది ప్రయాణం. మేము వెళ్ళింది మే నెలలో. సాధారణంగా ఆ నెలలో చండీఘర్లో సైతం వేడిగానే ఉంటుంది. కాకపోతే మేము ప్రయాణం చేస్తోంది ఉదయం వేళ కాబట్టి చల్లగా , ఆహ్లాదంగా ఉంది.

దూరంగా కనబడుతున్నాయి శివాలిక్ పర్వతాలు. మైదాన ప్రాంతం వీడి నెమ్మదిగా పర్వత పాదాలను తాకుతోంది రోడ్డు. అప్పటికి చండీఘర్ దాటి 20 కిలోమీటర్లు వచ్చేశాం. పింజోర్ గ్రామాన్ని చేరుకున్నాం. ఇక్కడే వున్నాయి ప్రసిద్ది గాంచిన పింజోర్ గార్డెన్స్. వీటినే యాదవీంద్ర గార్డెన్స్ అని కూడా అంటారు. ఉదయం ఏడు గంటల సమయంలో గార్డెన్స్ కు చేరుకున్నాం. కాశ్మీర్లో ప్రసిద్ది గాంచిన మొఘల్ గార్డెన్స్ శైలిలోనే నిర్మించబడ్డాయి ఈ తోటలు. క్రీస్తు శకం 9-12 వ శతాబ్దంలో నిర్మించారు ఈ తోటల్ని. ఆ తర్వాత తిరిగి 17 వ శతాబ్దంలో ఆధునికీకరించారు.


ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళాక చెట్లన్నిటికీ ఏవో కాయల్లా వ్రేలాడుతుండడం గమనించాం. పరీక్షగా చూస్తే అవన్నీ గబ్బిలాలు. చాలా పెద్ద సైజులో, కుప్పలు కుప్పలుగా, వేల సంఖ్యలో ఉన్నాయవి. ఎర్లీ మార్నింగ్ కావడంతో ఫౌంటైన్లను ఇంకా విప్పలేదు. చాలా ప్రశాంతంగా వుంది వాతావరణం. అక్కడే పచ్చిక బయలుపై కూర్చుని ఇంటి దగ్గర (హైదరాబాద్) నుంచి తెచ్చుకున్న అరిశెలు, చక్రాలు, సున్నుండ లను తిన్నాం.

బయటకు వచ్చాక పక్కనే ఉన్న భీమాదేవి ఆలయానికి వెళ్లాం. అయితే ఉదయం పది గంటలకు గాని గుడి తెరవరని చెప్పారు. వెనుతిరిగాం. అక్కడే ఉన్న షాపులో మా ఆవిడ కొన్ని డ్రై ఫ్రూట్లను కొన్నది. మా ప్రయాణంలో షాపింగ్ మొదలు. ఇకనుంచి లగేజి పెరగడం మొదలవుతుంది. కారెక్కి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం.

ఒక అయిదారు కిలోమీటర్ల దూరం వెళ్ళాక కల్కా పట్టణం గుండా వెళ్తున్నప్పుడు రహదారి పక్కనే ఒక గుడి కనబడింది. మా తివారి (డ్రైవరు) ని అడిగితే కాళీమాత గుడి అని చెప్పాడు. మా ఖర్మ కొద్దీ అతనికి ఒక విశిష్ట గుణం ఉంది. మేము ఆపమని చెపితేనే తప్ప ఎక్కడా కారును ఆపడు. ఎంత చూడ తగిన ప్రదేశమైనా సరే! దాటుకుంటూ గమ్యానికి వెళ్లి పోతూ ఉంటాడు. ప్రస్తుతం సిమ్లాకు బయలుదేరాం కాబట్టి అతను సిమ్లా వరకు ఎక్కడా ఆగడు. అదీ అతని పాలసీ. అదేమయ్యా అని అడిగితే అక్కడ చూడ్డానికి ఏమీలేదు అంటాడు. మా అంతట మేము తెలుసుకుని ,చూడాలనుకున్న ప్రదేశాలను మాత్రమే చూడగలిగాం. మాకు తెలియని ప్రదేశాలను మాత్రం మిస్సయ్యాం. గుడి గురించి నేను ముందే తెలుసుకున్నాను కాబట్టి కారును ఆపమని చెప్పాను . పార్కింగ్ ప్లేస్ లేదని, సిమ్లాకు వెళ్ళేటప్పటికి లేటవుతుందని ఏదో ఏదో నసిగాడు. గట్టిగా ఓ క్లాసు పీకేసరికి దారికి వచ్చాడు.

ఇక్కడ కొలువున్న కాళికాదేవి పేరుమీదే కల్కా అన్న పేరు ఆ పట్టణానికి వచ్చింది. మా సిమ్లా ప్రయాణంలో మేము దర్శించుకున్న మొదటి ఆలయం ఇదే. ఇక్కడి గుళ్ళన్నీ వైవిధ్యమైన రీతిలో నిర్మించబడి ఉన్నాయి. మూలవిరాట్టుకు చేసే అలంకారం కూడా విభిన్నంగా ఉంటుంది. తృప్తిగా దేవిని దర్శించుకుని మళ్ళీ ప్రయాణాన్ని సాగించాం.

టింబర్ ట్రయిల్: 22 వ జాతీయ రహదారిపై చండీఘర్ నుండి ౩౦ కిలోమీటర్ల దూరంలో, పింజోర్ గార్డెన్స్ కు 8 కి.మీ.ల దూరంలో, హర్యానా రాష్ట్ర సరిహద్దు దాటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాలకు రహదారి పక్కనే కనబడుతుంది టింబర్ ట్రయిల్. ఇది సోలన్ జిల్లాలో పర్వానూ అనే నగరానికి చేరువలో ఉంది. ఇంతకీ ఏమిటీ టింబర్ ట్రయిల్?


ఇదొక ప్రఖ్యాతి గాంచిన రిసార్ట్. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తులో , శివాలిక్ పర్వతాల మధ్యలో ఉన్న అందమైన రిసార్ట్. ఈ రిసార్ట్ లోనే రెండురోజులు బస చేసి ప్రకృతి అందాలను ఆస్వాదించ వచ్చు. అలాంటి సకల సౌకర్యాలూ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ రిసార్ట్ లను చేరుకోవాలంటే ఈ పర్వతంపై ఉన్న రహదారి నుంచి 1.8 కి.మీ.ల దూరంలో మరో పర్వతంపై ఉన్న రిసార్ట్స్ కు కేబుల్ కార్ ద్వారా వెళ్ళాలి. అద్భుతమైన అనుభవం అది. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ కేబుల్ కార్ అందుబాటులో ఉంటుంది. రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళే కాక మామూలు పర్యాటకులు కూడా కేబుల్ కార్ ఎక్కి రిసార్ట్లో కాసేపు గడిపి రావొచ్చు. మనిషికి 350 రూపాయల చార్జి.

కేబుల్ కార్ లో వచ్చేందుకు పేరంట్స్ భయపడటంతో నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు కేబుల్ కార్ ఎక్కాం. చూస్తూ చూస్తూ ఎంతో ఎత్తుకు... రెండు కొండల మధ్య గాలిలో వ్రేలాడుతూ... ఎక్కడో పాతాళాన ఉన్నట్టుగా సన్నటి పాపిటలా వంపులు తిరుగుతూ పారుతున్న కౌసల్యా నదిని ఆశ్చర్యంగా చూస్తూ... ఒక వైపు భయం, మరో వైపు ఉత్కంటత. మా పెద్దాడు వీడియో కవరేజ్ చేస్తుంటే, నేను డిజిటాల్ కెమెరాతో ఫోటోలు తీస్తూ పోయాను. (పక్కన ఉన్న ఫోటోలో ఏరియల్ వ్యూ చూడ వచ్చు.) మధ్యలో మరో కొండ మీద ఏదో గుడి. అమ్మవారి గుడే. దాదాపు పది నిమిషాల ప్రయాణం తర్వాత పదకొండు గంటల సమయంలో రిసార్ట్స్ ను చేరుకున్నాం. అక్కడ పిల్లలు కాసేపు రైడ్స్ ను ఎంజాయ్ చేసారు. రిసార్ట్స్ లోని హోటల్, స్విమ్మింగ్ పూల్, బార్ , వివిధ ప్రదేశాల నుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు చాలా బాగున్నాయి. ఒక గంట పాటు అక్కడ గడిపి తిరిగి కేబుల్ కార్ ద్వారా వెనక్కి వచ్చేసాం.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు టింబర్ ట్రయల్ నుండి సిమ్లాకు బయలు దేరాం.
(మిగతాది 'సిమ్లా' లేబుల్ తో ...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి