పేజీలు

2, మార్చి 2010, మంగళవారం

మోసగించువాడు ధన్యుడు సుమతి...!

ప్రతి రోజు మోసగాళ్ళ గురించి విని ముక్కున వేలేసుకోవడం మనకు అలవాటయిపోయింది. తెల్లారి మళ్ళీ మోసపోవడం లేదా మోసం చెయ్యడం షరా మామూలే ! పిల్లి చాతకానిది అయితే ఎలుక తోకేత్తి ఆడుతుంది అని లోకోక్తి. మనం మోసపోయామంటే అది మన తెలివి తక్కువతనం. అవతలివాడి గొప్పతనం. మోసం చేయడం ఎంత ధైర్యంతో కూడుకున్న పని!? ఎంత రిస్క్!? అయినా మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది అంటే మన చాతకానితనం ఎ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు.

మనలాంటి మరో మనిషి నేను దేవుడిని అంటే మనలాంటి మనిషి దేవుడెలా అవుతాడు? అని ఆలోచించడం కామన్ సెన్స్. అలాంటి కామన్ సెన్స్ లేకుండా మోసపోయి, వాడిని మోసగాడు అనటం ఏం సబబు? ఓటు కోసం నోటు ఇస్తుంటే గెలిస్తే వాడికేంటి లాభం? అని ఆలోచించకుండా ఓటు వేసి నాయకులు మోసంచేశారు అనడం, దేశాన్ని దోచుకు తింటున్నారు అని అక్కసు కక్కడం ఎంత వరకు సమంజసం? వందకు వంద లాభం చూపిస్తా అని అంటే ఎక్కడ నుంచి తెస్తాడు? ఎలా తెస్తాడు? అని ఆలోచించకుండా వాడి చేతిలో లక్షల కష్టార్జితాన్ని ఆశతో పోసేసి వాడు బోర్డు తిప్పెశాక మోసంచేశాడు అనడం న్యాయమా? మన తప్పుల్ని, బలహీనతల్ని, అవివేకాన్ని ప్రశ్నించుకోకుండా ఎదుటివాడిని నిందించడం తప్పు.

కల్కి లాంటి వాళ్ళని నెత్తిన ఎక్కిన్చుకున్నది మనం. మన నాయకులు వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారంటే వాళ్ళ ప్రయోజనాలేవో వాళ్ళ కుంటాయి. అది ఆలోచించకుండా వాళ్ళే వచ్చి మోకరిల్లగా లేనిది నేనెంత అనుకోవడం అమాయకత్వం కాదా? మన ఇష్ట పూర్వకంగా ఒకడు మనల్ని దోచుకుంటే అది మోసం. మనల్ని అడక్కుండా, మన ఇష్టం లేకుండా దోచుకుంటే అది దోపిడీ. మోసానికి అనుమతి నిచ్చేది మనం. అందుకని మోసగాల్లని నిందించకండి. ఈ సమాజంలో మోసగించువాడు ధన్యుడు. అది చాతకాని వాడు అసమర్ధుడు. నీకు మోసం చేయడం చాతకాక పొతే పోనీ. కనీసం మోసపోకుండా ఉండు చాలు. అప్పుడు మోసగాళ్ళ సంఖ్యా తగ్గుతుంది.

1 కామెంట్‌:

  1. బాగాచెప్పారు. మనకు ఎన్నిసార్లుఙ్ఞానోదయమైనా మోసపోకుండామానముగదా!. అదేమోసగాళ్ళపాలిటి వరం.

    రిప్లయితొలగించండి