పేజీలు

8, మార్చి 2010, సోమవారం

ఇంటి మహిళను ఉద్ధరిద్దాం!

పొద్దున్నే పేపరు తిరగేస్తోంటే అన్నీ మహిళల గురించిన వార్తలు, కథనాలే. వాటిల్లో ఆడబిడ్డను కని తుప్పల్లో పడేసినతల్లి గురించి, అత్యాచారానికి గురైన యువతీ గురించిన రోజువారీ వార్తలతో పాటు, ఎన్నో ఏళ్ళ తరబడి వార్తల్లోఅవసరమైనప్పుడల్లా నానుతున్న మహిళా బిల్లు గురించిన వార్తలూ ఉన్నాయి. వాటిని చాలా హృద్యంగా ఉత్తమజర్నలిజం ప్రజెంట్ చేయగా , ఉత్తమ పాఠకుడి లెవెల్లో నేను చదువుతున్నాను. ఇంతలో కిచెన్లో వంట చేస్తోన్న మా ఆవిడవచ్చి బస్తాలో ఉన్న బియ్యాన్ని డబ్బాలో పొయ్యమని అడిగింది. పేపరు కూడా ప్రశాంతంగా చదువుకోనివ్వకుండాఏమిటీ అంతరాయం అని లోలోపల విసుక్కుంటూ పనిచేసి వచ్చాను. అలా కూర్చున్నానో లేదో నీల్లోచ్చాయనిపిలుపు. మళ్ళీ విసుగు. అలా అలా ఒక్కో పని. మళ్ళీ మళ్ళీ విసుగు. ఇంత జరుగుతున్నా మా ఆవిడ కూడా ఒకమహిళే అని, ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని నాకు గుర్తుకు రాలేదు. ఇది నా ఒక్కడి లోపం కాదు. పూర్తిగా మగజాతికి పట్టిన జాడ్యం.
దీన్నే పురుషాహంకారం అంటూ ఆడాళ్ళంతా పేరుపెట్టి పిలుస్తారు. అయితే అహంకారం, నిర్లక్ష్యం ఇంటి ఇల్లాలి పైనేతప్ప బయటి ఆడవాళ్ళ మీద ఉండదు. బయట ఒక అమ్మాయికి సాయం చేయాల్సి వస్తే మగపున్గవులంతా పోటీపడతారు. అదే సాయం ఇల్లాలికి చేయాల్సి వస్తేనే విసుగు. భార్యను ఆఫీసు దగ్గర దిగబెట్టాలంటే ఆఫీసులో అర్జంటు వర్క్గుర్తుకు వస్తుంది . అదే ఆఫీసులో కొలీగ్ ఎవరన్నాఅమ్మాయి తనకు లిఫ్ట్ ఇమ్మని కోరితే , స్త్రీ జనోద్ధరనే తన పరమధర్మం అన్నట్టు అడుగున్నర విస్తీర్ణంలో ఉన్న బైక్ సీటుపై తనతో పాటు ఆవిడను కూర్చోబెట్టుకుని స్పర్శానుభూతినిపొందుతూ మహిళా సేవ చేస్తారు. తన బాస్ లేడీ అయితే ఆమెను మేడం అంటూ విధేయత ప్రదర్శించడానికి వెనుకాడం. అవసరమైతే నోరారా పొగిడి కాకా పట్టడానికి కూడా జంకం. అదే తన ఇల్లాలి దగ్గరికి వచ్చేసరికి తను ఏమాత్రం ఆధిక్యతప్రదర్శించినా ఒప్పుకోం. ప్రేమించిన అమ్మాయి అయితే సిగ్గు వదలి బ్రతిమిలాడు కుంటాం. అదే అమ్మాయి పెళ్ళయిపెళ్ళాంగా మారితే బ్రతిమిలాడాలంటే అవమానంగా భావిస్తాం. ఎందుకంటే ఇల్లాలు ఏం చేసినా ఇంటిని, మనలను వదిలిఎక్కడికి పోలేదనే చులకన భావం. అందుబాటులో ఉన్న అనురాగంపై నిర్లక్ష్యం.
మహిళ అంటే మన ఇంట్లో ఉన్న భార్య, తల్లి, చెల్లి.. వీళ్ళను గౌరవిద్దాం. మనల్ని మనం గౌరవించుకుందాం! అన్నట్టుచివరికి మా ఆవిడకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పానులెండి. ఇదే రోజు నేను చేసిన మహిలోద్ధరణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి