పేజీలు

22, మార్చి 2010, సోమవారం

ద క్లాక్..!


నిద్రలో మెలకువ వచ్చింది. అయినా కళ్ళు తెరవలేదు. మధ్య ప్రతి రోజూ ఇలాగే జరుగుతోంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లకు ఇలాగే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మెలకువ వచ్చి నిద్రను పాడు చేస్తుందట. అందుకే రాత్రి భోజనంతర్వాత కనీసం గంట వరకు పక్కమీదికి పోగూడదని డాక్టర్లు అంటారు. చేయకూడదని తెలిసినా కొన్ని కొన్ని మనం చేయకుండా ఉండలేం. అది మన బలహీనత. ఏదయితేనేం? నాకు మెలకువ వచ్చింది. ఏవో ఆలోచనలు మొదలయ్యాయి.

టంగ్..
గోడ గడియారం గంటలు కొట్టడం మొదలుపెట్టింది. ఇదీ మామూలే. నాకు మెలకువ వచ్చిన కాసేపటికి రెండు గంటలు కొడుతుంది. అలా ఆలోచనలలో ఉండగా మూడు గంటలు కొడుతుంది. తర్వాత నేను మళ్ళీ నిద్రలోకి జారుకుంటాను. గడియారాన్ని మా అబ్బాయి మొదటి పుట్టిన రోజు ఫంక్షన్ కు ఎవరో ప్రజంట్ చేసారు. గిఫ్టు ప్యాక్ మీద పేరు రాయకపోవడంతో ఎవరు ఇచ్చారు అన్నది తెలీలేదు. వీడియోలోను, ఫొటోలలోనూ చూసినా తెలియలేదు. చూడడానికి మాత్రం చాలాబాగుంది.
టంగ్..రెండు
టంగ్..మూడు..
అరె! రోజు ఒక గంట ఆలస్యంగా మెలకువ వచ్చిందన్న మాట. అసలు రాత్రిళ్ళు ఇలా మెలకువ వచ్చి నిద్రను పాడుచెయ్యకుండా ఉంటె ఎంత బాగుండు! నిద్ర లేమితో మరిన్ని రోగాలు వస్తాయంట. స్మోక్ చెయ్యడం మానెయ్యాలి.
టంగ్..నాలుగు
పరవాలేదు. రోజు బాగానే నిద్ర పట్టిందే!
టంగ్.. అయిదు
అప్పుడే అయిదయిందా!?
టంగ్.. ఆరు
ఆరు! నిజమా? అలా అయితే అయిదున్నరకి మొబైల్ ఫోన్లో అలారం పెట్టుకుని నిద్ర లేచే మా ఆవిడ ఇంకా లేవలేదేంటి? అలారం పెట్టుకోడం మర్చిపోయిందా? లేక అలారం మ్రోగినా మెలకువ రాలేదా? రోజూలా నాకెందుకు అర్థరాత్రి మెలకువరాలేదు? మా ఆవిడ వంక చూసాను. గాడ నిద్రలో ఉన్నట్టు ఉంది.
టంగ్.. ఏడు
మై గాడ్! పెద్దాడి స్కూలుకి టైం అయిపొయింది. ఇంకో పది నిమిషాలలో స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. వీళ్ళెవరు ఎందుకులేవలేదు? ఏం ..అయ్యింది?
టంగ్.. ఎనిమిది
కిటికీ వైపు చూసా. బయట చీకటిగానే ఉన్నట్టు ఉంది. ఒకవేళ గడియారంలో టైం తప్పుగా సెట్ చేసామా? మా పెద్దాడు దీన్ని కూడా కేలికాడన్నమాట. ఇంట్లో ప్రతి వస్తువును విప్పి చూడడం, అదెలా పని చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంచెయ్యడం వాడికి అలవాటే. మంచి అలవాటే. పెద్దయ్యాక ఇంజినీర్ అవుతాడేమో!
టంగ్.. తొమ్మిది
సందేహం లేదు! గడియారంలో సెట్ చేసిన టైం తప్పు.
టంగ్..పది
ఒకసారి లేచి నిజంగా టైం ఎంతయ్యిందో చూస్తే పోలా!
టంగ్.. పదకొండు
తను సెల్ ఫోన్ను దిండు పక్కనే పెట్టుకుని నిద్ర పోతుంది. చేతులతో తడుముతూ వెదకడం మొదలు పెట్టాను.
టంగ్.. పన్నెండు
పన్నెండు గంటల వరకు నిద్ర..నవ్వు రాబోయి ఆగింది. సిల్లీ! ఇందాక నుంచీ ఏవేవో ఆలోచిస్తున్నానెందుకు? అసలిది అర్థరాత్రి పన్నెండు ఎందుకు కాకూడదు? అతిగా ఊహించుకోవడం అంటే ఇదే. యిలాంటి జబ్బులు కూడా ఉంటాయని,
సైకాలజీలో ఈ జబ్బులకు పేర్లు కూడా ఉన్నాయని ఎక్కడో చదివాను. కాని ఒక్కోసారి ఎంత మేధావికి అయినా ఇలాంటి పరిస్థితులు తప్పవు. అతను కూడా మనిషేగా!
టంగ్.. పదమూడు
పదమూ.. అసలు గడియారంలో పదమూడు గంటలు కొట్టే ఏర్పాటు ఉంటుందా? లేదు దానికి రిపేరు వచ్చింది. రిపేరు కాదు మానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ .
టంగ్.. పద్నాలుగు
ఎన్ని గంటలు కొడుతుంది? ఎంత దాకా కొడుతుంది?
టంగ్.. పదిహేను
తెల్లార్లూ కొడుతూనే ఉంటుందా? ఇప్పటి దాకా ఎవరూ లేవలేదు. ఇలా కాసేపు వదిలేస్తే అందరూ లేస్తారు. అందరి నిద్రా పాడవుతుంది. వెళ్ళి దాంట్లో బ్యాటరీ తీసేస్తే పోలా?
టంగ్..పదహారు
నెమ్మదిగా మంచం దిగాను.
టంగ్..పదిహేడు
హాలు లోకి అడుగు పెట్టాను. గడియారం తగిలించి ఉండే గోడ వైపు చూసాను. అక్కడ గడియారం లేదు. ఏమయ్యింది? ఎవరయినా దాన్ని వేరే రూములోకి మార్చారా..?
పిల్లల బెడ్రూంలో చూసాను. కనబడలేదు. కిచెన్లో..
చూసొద్దాం. వంట చేసేటప్పుడు సమయం తెలియాలని మా ఆవిడ కిచెన్లో పెట్టిందేమో! ..వెళ్ళి చూసాను. ఊహు! లేదు.
బాత్రూంలో..సిల్లీ!..హక్కడ ఎవరయినా..ఏమో చూద్దాం.
రెండు బాత్రూములూ వెదికాను. లేదు. మరి ఏమయ్యింది? ఒకవేళ మా బెడ్రూం లోనే ...! యా! ఎవిరి థింగ్ ఈజ్ పాజిబిల్ ఇన్ కన్ఫ్యూజన్.
వెళ్ళి మా బెడ్రూంలో మళ్ళీ చూసాను. కనబడలేదు. ఇంట్లో ఏ గోడకూ లేకుండా ఎక్కడికి పోయింది? ఏ గోడకు.. ఇప్పుడు గుర్తొచ్చింది. నేను వెదికింది గోడల పైనే. కాని అది ఏ అలమారాలోనో ఎందుకు ఉండకూడదు. నిన్నేప్పుడో మా ఆవిడ అన్న మాటలు గుర్తొచ్చాయి. గడియారం తగిలించిన చోటు అంత విసిబిల్ గా లేదని దానిని వేరే చోటుకు మారుద్దామని అంది. కర్రెక్ట్ ! వేరే చోటుకు మార్చాలని దానిని అక్కడ నుండి తీసి వుంటుంది. సమయం చాలకో, లేక మరెందుకో దానిని ఏ అలమారా లోనో పెట్టి ఉంటుంది. అనవసరంగా ఈ టైం లో దానిని వెదకడం ఎందుకు? ఎలాగు గంటలు కొట్టడం ఆపేసిన్దిగా..
పక్క మీద పడుకోబోతుండగా ఓ సందేహం. నేను లేచేదాకా గంటలు కొట్టిన గడియారం నేను లేచిన వెంటనే ఆపేసింది ఎందుకు? ...ఏమో..ఇక దీని గురించి ఆలోచించడం మానేస్తే బెటర్. పక్కకు తిరగపోతుండగా చేతికి సెల్ ఫోన్ తగిలింది. టైం చూసాను. మూడయింది. రోజూలానే మెలకువ వచ్చిందన్న మాట. నెమ్మదిగా నిద్ర పట్టింది.

* * * * * * * *
ఉదయం నిద్ర లేచి హాలులోకి వచ్చాను.
టంగ్..
చప్పున గోడవైపు చూసాను. గడియారం అక్కడే ఉంది. ఆరున్నర. అందుకే ఒక గంట కొట్టింది. కిచెన్లో వంట చేసుకుంటున్న మా ఆవిడను అడిగాను, '' గడియారాన్ని మళ్ళీ అక్కడే తగిలించావే?''
''ఏ గడియారం?''
''ఉన్నదే ఒక్క గడియారం. అదే ఆ హాలులోని గోడ గడియారం.''
''నేను తగిలించడం ఏంటి? నువ్వేగా అప్పుడు, అక్కడ తగిలించింది. ''
''అక్కడ నుంచి మార్చాలన్నావుగా? ''
''అన్నాను. అయితే ఆ పని చేసే ఓపిక నాకెక్కడిది? నీతోనే చేయిస్తా ఈ ఆదివారం .''
ఇంకా ఏదో మాట్లాడుతున్నా ..నా చెవులకు వినబడటం లేదు. హాలులోకి వచ్చి గడియారం వైపే చూస్తూ ఉండిపోయాను. ........... ........... (కల్పితం)





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి