పేజీలు

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నా సిమ్లా పర్యటన


('కురుక్షేత్రం ' తరువాయి..)

కురుక్షేత్ర నుండి చండీఘర్ దాదాపు 100 కి. మీ.లు. ఒకటవ నంబరు జాతీయ రహదారి పై అంబాలా వరకు ప్రయాణించి అక్కడనుండి కుడి వైపుకు 22 వ జాతీయ రహదారి గుండా చండీఘర్ చేరుకోవాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం. అంతేకాకుండా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది.

దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన మొదటి నగరం చండీఘర్. నగరం అంతా నలుచదరపు గళ్ళలాగా విభజించబడి ఉంటుంది. వీటన్నిటికి సెక్టార్ ఒకటి,రెండు,...అరవై మూడు అని పేర్లు ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రముఖ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బ్యుసర్ పర్యవేక్షణలో ఈ నగరం నిర్మిచబడింది. నివాస, పని, ఆరోగ్యం, ఆత్యాద్మిక ప్రాంతాలనే నాలుగు ప్రాంతాలుగా నగరం విభజించబడింది. నివాసప్రాంతాలలో కేవలం ఇళ్ళు, స్కూళ్ళు, చిన్న చిన్న పార్కులు ఉంటాయి అంతే. వర్కింగ్ ఏరియాలో ఆఫీసులు, పరిశ్రమలు ఉంటాయి. సెక్టార్ 17 నగరానికి గుండె లాంటిది. ఈ సేక్తార్లోనే బస్టాండ్ నుంచి పాలనా యంత్రాంగపు కార్యాలయాలన్నీ ఉంటాయి.

మేము సెక్టార్ 15 లో ఉన్న మా డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ లో దిగాం. చండీఘర్లో చూడాల్సిన ప్రదేశాలు..సుఖన లేక్, రాక్ గార్డెన్ , చండీ మాత ఆలయం.. అంతే. వీటిల్లో తప్పనిసరిగా చూడాల్సింది రాక్ గార్డెన్.

మా ప్లాన్ ప్రకారం చండీఘర్ సైట్ సీయింగ్ అనేది తిరుగు ప్రయాణంలో చేయాలనుకున్నాం. అందుకని ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం ఆరు గంటలకు సిమ్లాకు ప్రయాణం అయ్యాం.

(మిగతాది 'సిమ్లా' శీర్షికతో...)

10, ఫిబ్రవరి 2011, గురువారం

నా సిమ్లా పర్యటన

డిల్లీ నుంచి అంబాలా వెళ్ళే ఒకటవ నంబరు జాతీయ రహదారిపై పానిపట్టు, కర్నాల్ లను దాటిన తర్వాత తానేసర్ కంటే ముందు పిప్లీ అన్న ఊరోస్తుంది. అక్కడ నుండి ఎడమకు తిరిగి 6 కి.మీ. లు లోపలికి వెళ్తే వస్తుంది కురుక్షేత్రం. కురుక్షేత్రం అన్నది హర్యానా రాష్ట్రంలోని ఒక జిల్లా కూడా. అక్కడికి వెళ్లకముందు హైవే మీదే ఉన్న ఒక ధాబా దగ్గర భోజనం చేసేందుకు ఆగాం.

అక్కడ నాన్వెజ్ దొరకడం చాలా తక్కువ. మా ప్రయాణం మొత్తంలో ఆలుగడ్డ కూర, రాజమ పప్పు, రొట్టెలతో కూడిన భోజనమే చేసాం. అక్కడ ఆలూ ఎక్కువగా పండుతుంది. కందిపప్పు , చింత పండు అసలు వాడరు. ఉల్లి, కీరా వంటి వెజిటబుల్ సలాడ్ ను ఇక్కడ మనకు ఫ్రీగానే ఇస్తారు. కాని అక్కడ ౩౦-40 రూపాయలు వసూలు చేస్తారు. చివరికి పెరుగు కావాలన్నా డబ్బులు పెట్టాల్సిందే. రైస్ దొరుకుతుంది కాని అన్ని చోట్ల ఉండదు. ఉన్నా ఆ లావాటి మెతుకులు తినడం కాస్త కష్టం. ఇక డ్రైవరుకు మనం ప్రత్యేకించి తినిపించానక్కర లేదు. దాబా లేదా హోటల్ వాళ్ళు వారికి ఉచితంగానే eపెడతారు. అయితే పాసెంజరు బిల్లులోనే ఆ చార్గీలను ఇరికించేందుకు చూస్తారు. మా మొదటి మజిలీలో అదే జరిగింది. eఅయితే బిల్లు చెక్ చేసుకోడంతో బయటపడి అడిగితే డ్రైవర్ తనే పే చేస్తానని బిల్డప్ ఇచ్చాడు. నిజానికి వాళ్ళ దగ్గర ఫ్రీ ఫుడ్డు, మన ఖాతాలో డబ్బులు రెండూ నొక్కే మాయాజాలం అన్నమాట. అందుకే ప్రైవేటు వాహనాల పై వెళ్ళేవారు ఇటువంటి మోసాల పట్ల అప్రమతంగా ఉండాలి. అలాగే డిస్టెన్స్ కూడా మజిలీ చేసిన ప్రతీ చోటా నోట్ చేసుకోవాలి. మనకూ ఏది ఎక్కడనుంచి ఎంత దూరం ఉందొ తెలుస్తుంది. మీటరు సరిగా ఉందొ లేదో కూడా తేలుతుంది. తేడా వచ్చి వాహనాన్ని వెనక్కు పంపాలన్నా రిటర్న్ కూడా ఇచ్చిపంపాలి. కాబట్టి ట్రావెల్స్ వాళ్ళ తో చాలా జాగ్రతగా వ్యవహరించాలి. ఇక మన టూర్ ఎలా జరుగుతుంది అనేది మనతో పాటు వచ్చే డ్రైవరును బట్టి, అతనితో మనం వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. రోజు వారీ బత్తా రెండొందలు ఇస్తున్నా , అప్పుడప్పుడూ కాస్త అతని కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో , ఈ టూర్ కు సంబంధించి చేసిన మొదటి భోజనం , కాబట్టి వెరైటీని బాగానే ఎంజాయ్ చేసాం.

ఉదయం 11 గంటలకు డిల్లీ నుంచి బయలుదేరిన మేము మద్యాహ్నం ౩ గంటలకు కురుక్షేత్రం చేరాం. కురుక్షేత్రం అనేది మహాభారత ఇతిహాసానికి సంబంధించిన ఘట్టాలను వివరించే అనేక ప్రదేశాలున్న ఒక క్షేత్రం. కురు అనే ఒక రాజు పేరుమీద ప్రస్సిద్ది గాంచిన ప్రాంతం. ఇక్కడ బ్రహ్మ సరోవర్, జ్యోతి సర్, భద్రకాళి టెంపుల్, స్తానేస్వర్ టెంపుల్ అనే అనేక గుడులు, తటాకాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. జ్యోతిసర్ అన్న చోట కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడంట. భీష్మ కుండ్ అన్న చోటే భీష్మ పితామహుడు అంపశయ్యపై పుణ్యకాలం కొరకు వేచి ఉన్నాడంట.

మొదట మేము బ్రహ్మ సరోవర్ అన్న చోటుకు వెళ్లాం. ఒక పెద్ద సరస్సు ఉందక్కడ. పక్కనే ఒక శివాలయం ఉంది. ఇక్కడ నుంచే బ్రహ్మ తన సృష్టిని మొదలు పెట్టాడంట. ఈ సరస్సులో అమావాస్య నాడు వచ్చే గ్రహణం రోజున, సూర్య గ్రహణం రోజున స్నానం చేస్తే పాపాలన్నీ తుడిచిపెట్టుకు పోవడంతో పాటు, అశ్వమేధ యాగం చేసినంత ఫలం సంప్రాప్తిస్తున్దంట. ఇక మిగిలిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళమంటే ఈ ప్రదేశాల గురించి నాకు తెలీదు, ఎవరైనా జీపు వాళ్ళని మాట్లాడనా? అని డ్రైవర్ అనేటప్పటికి మాకు నోట మాట రాలేదు. ఎవరినో మాట్లాడే దానికి ఇతనిని పెట్టుకున్నది ఎందుకు? అతనితో మొదటే తగవు పెట్టుకోవడం ఇష్టం లేక జీపు వాళ్ళని అడిగితే 600 రూపాయలు అడిగారు. అప్పటికే ఎండ వేడికి అలసి పోయి ఉండడం చేత , త్వరగా చండీఘర్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని ఉండటం చేత , అక్కడ నుండి బయలు దేరాం. ఈ రకంగా ఆదిలోనే హంస పాదు అన్న చందాన గీతోపదేశం జరిగిన ప్రదేశాన్ని చూడకుండానే వెనుతిరిగాం.

రాత్రి 7 గంటల సమయంలో చండీఘర్ చేరుకున్నాం.
(మిగతాది 'చండీఘర్ ' శీర్షికతో..)

5, జనవరి 2011, బుధవారం

ఏమిటీ దౌర్భాగ్యం ?

సెటిల్మెంట్ దందాలో రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి కుమారుడు!
మరో రాష్ట్రంలో ఒక వివాహిత, పవిత్రమైన ఉపాద్యాయ వృత్తి లో ఉన్న ఒక మహిళపై ఒక ఎమ్మెల్యే ఆయన అనుచరులుకలిసి మూడేళ్ళుగా అత్యాచారం చేయటం. పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేని దుస్థితి.
ఎక్కడ ఉన్నాం మనం? ఏదో సినిమాలో పరుచూరి రాసిన డైలాగు గుర్తొస్తుంది.

రా- రాక్షసంగా
జ - జనానికి
కీ- కీడు చేసే
యం- యంత్రాంగం


ప్రతి రోజు వార్తా పత్రిక చదువుతుంటే నిజమే అనిపిస్తుంది కదూ! మన చేతిలో ఓటు ఉండీ మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం అంటే మనం ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లలకు పంచ తంత్రకథలు చెప్పాం. ఇప్పుడు రక్త చరిత్రలను చూపిస్తున్నాం. ఇక రేపటి చరిత్ర ఎలా ఉంటుందో ఊహించండి.

18, డిసెంబర్ 2010, శనివారం

నాగవల్లి కాదు చంద్రముఖి రీమేక్! ఇష్టమైతే చూడొచ్చు.


ఒక సినిమాకు సీక్వెల్ అంటే మొదటిదాని కథ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండి మొదలయ్యే మరో కథ. పాత్రలు అన్నీకాకపోయినా కొన్ని మాత్రం రెండో దానిలోనూ ఉండాలి. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి కథ సీక్వెల్కథలాగే ఉంది. ఎటొచ్చీ కథనం మాత్రం చంద్రముఖి సినిమాను ఆర్టిస్టులను మార్చి రీమేక్ చేసినట్టుగా ఉంది. అవే సీన్లు. డైలాగులు కూడా అవే. పాటల ప్లేస్మెంట్ కూడా మక్కీకి మక్కీ.

చంద్రముఖీ కి సీక్వెల్ అనగానే ఆ స్థాయి థ్రిల్ ఉంటుందని వస్తాడు ప్రేక్షకుడు. అంతే కాని అదే సినిమాని మళ్ళీచూడాలనుకోడు. ఇది దర్శకుడు వాసు ఎందుకు తెలుసుకోలేదో తెలీదు. పైగా ఇక్కడ జరిగింది ఏమిటంటే.. అవే సీన్లురిపీట్ అయ్యేసరికి ప్రేక్షకులు ఆర్టిస్టుల పర్ఫార్మేన్సును పోల్చి చూసుకున్నారు. దాంతో వీరంతా తేలిపోయారు. ముఖ్యంగా వెంకటేష్ , అనుష్క. వెంకటాపురం రాజాగా వెంకటేష్ నటన బాగానే ఉన్నా , ఆ పాత్రలో ఉండాల్సినంతక్రౌర్యాన్ని, చంద్రముఖి మీద అతనికున్న విపరీత వ్యామోహాన్నీ చూపించడంలో దర్శకత్వ లోపం కనబడింది. అదేపాత్రలో రజని చూపించిన హావభావాలు అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు ప్రాణం. అలాగే క్లైమాక్స్ లో జ్యోతికరక్తి కట్టించినట్టుగా చేసేందుకు నాగవల్లిలో ఎవరి పెర్ఫార్మేన్సుకు అవకాశం లేకుండా పోయింది. అనుష్కాను మరింతగాఉపయోగించుకుంటే బాగుండేది.

అసలు అంతమంది హీరోయిన్లు అవసరమా అనిపించింది. శ్రద్ధాదాస్ , పూనంకౌర్ లు శుద్ధ వేస్ట్. కమలిని ముఖర్జీ ట్రాక్ ,కథను సాగతీయడానికి తప్ప ముఖ్య కథకు అతక లేదు. రిచా గంగోపాద్యాయ పరవాలేదనిపించింది. ఒక్క ముక్కలోచెప్పాలంటే అనుష్క, రిచాలతోనే కథను రంజింప చేయవచ్చు. పోనీ ఇంతమంది హీరోయిన్లు ఉన్నందువల్ల గ్లామర్కురిసిందా అంటే అదీ లేదు.

వెంకటేష్ గురించి వెళ్ళే వాళ్లకు ఈ సినిమా ఒకే . మూడు రకాల గెటప్ లలో విభిన్నంగా కనిపించాడు. సైకియాట్రిస్ట్ , వెంకటాపురం రాజా వారి పాత్రల్లో రజనీతో పోల్చుకోకుండా చూస్తే వెంకీ బాగానే చేసినట్టు. కాకపోతే ప్రతి సీన్లోను కామెడీకాకుండా అవసరమైన చోట్ల అయినా సరే కాస్త సీరియస్ నెస్ మెయింటేన్ చేయాల్సింది.

గ్రాఫిక్స్ బాగున్నాయి. ముఖ్యంగా పాము చాలా సహజంగా కనిపించి సన్నివేశాలను రక్తి కట్టించింది. మానసిక శాస్త్రంలోతీరని, బలమైన కోరికకు సంకేతం పాము. ఇక్కడ ఒక మానసిక సమస్య మొదలు అయ్యిందని చెప్పడానికిఉపయోగించుకున్నారు. హీరోయిన్ రిచా చేత పాత సినిమాలో మాదిరి ఒంటి చేత్తో మంచాన్ని లేపించాలని మంచం దగ్గరషాట్ కూడా తీశారు. అంతలో మనసు మార్చుకుని శాండ్లియర్ సీన్ తీసారు.

అసలు ఈ సినిమాకు నాగవల్లి అన్న టైటిల్ వేస్ట్. ఒకే ఒక డైలాగులో తప్పదన్నట్టు నాగవల్లి అని పిలిపించి టైటిల్ కున్యాయం చేశాం అనిపించారు. నిజానికి ఇది చంద్రముఖి - రెండు.

మొత్తం మీద కుంటుంబం మొత్తం ఏదో ఒక సినిమాకు వెళ్లి టైం పాస్ చేద్దాం అనుకుంటే నాగవల్లికి వెళ్ళొచ్చు. అయితేచంద్రముఖిని ఇంట్లోనే వదిలేసి వెళ్ళండి.

15, డిసెంబర్ 2010, బుధవారం

ఎందుకోసం ఈ 'ఫ్రాకులాట'?







డిల్లీలో తలదాచుకోడానికి ఇల్లు లేని దాదాపు లక్ష మంది అభాగ్యులు, కప్పుకోడానికి కనీసం ఓ గుడ్డ ముక్క కూడాదొరక్క చలికి అల్లాడుతూ రోడ్ల పక్కన నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని వార్త. అలాంటి అభాగ్యులు మనహైదరాబాదులోనూ చాలామంది ఉన్నారు.

అయితే ఈ ప్రక్క ఫోటోలలో ఉన్న అభాగ్యుల సంగతి వేరు. వారు వేసుకునే డ్రస్సు ఖరీదుతో పది మంది నిర్భాగ్యులకు రెండేసి రగ్గులు చొప్పున కొని ఇవ్వవచ్చు.. అయినా అదేం ఖర్మో కాని అంత పెట్టి కొన్న డ్రస్సు సగం శరీరాన్ని కప్పుకుండా చలి గాలికి వదిలేస్తోంది. కెమరా ఫ్లాషులకు సగం శరీరాన్ని అప్పగించేస్తుంది. ఈ ఫోటోలలో చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపల్ని చూస్తే విషయం మీకే అర్థం అవుతుంది. ఒక రకంగా ఇది వారికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఏమరుపాటున కూర్చునే భంగిమలో తేడా వస్తే కేమెర కళ్ళు ఫ్రేముల్లో పసిగట్టేస్తాయి. క్షణాల్లో లక్షలాది మందికి చేరవేస్తాయి. ఎంతైనా వాళ్ళూ ఆడవాళ్లేగా. ఓ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళేగా? సమాజాన్నిలెక్క చెయ్యరు సరే, కుటుంబ సభ్యుల సంగతేంటి? అయినా ఇంత రిస్కు వాళ్ళెందుకు చేస్తున్నట్టు? ఈ పాకులాట ఎందుకోసం? ఎవరిని ఆకర్షించడానికి? ఎలాంటి ఆఫర్లు సంపాదించడానికి? సినిమా ఆఫర్లు సంపాదించడానికి కావలిసింది ఏంటి? అందం, ప్రతిభ - ఇవి కాదా? ఈ ప్రదర్శనలు అవసరమా? సెన్సారు కళ్ళు కప్పి ఎలాగు సినిమాల్లో ఎక్స్ పోజ్ అవుతూనే ఉన్నారు. అయితే ఆ సినిమాలు సరిగా ఆడటం లేదు కాబట్టి, ఆడియో ఫంక్షన్లలో ,అవార్డు కార్యక్రమాల్లో, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ ఎక్స్ క్లూసివ్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

ఎవరు ఎలా పోతే మనకెందుకు? అయినా నెట్ జనులు చూసి ఆనందిస్తున్నారుగా, మద్యలో నీకేంటి? అంటారేమో! నిజమే కాని, సినిమా ఆఫర్ల గురించి ప్రయత్నించే, లేదా మరే ఆఫీసులోనో మంచి అవకాశాల గురించి ప్రయత్నించే ఆడపిల్లలకు, అవకాశం ఇచ్చేవారికి ఇది ఎ రకమైన సంకేతాలనిస్తుంది?

అందాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. ఎందుకంటే సౌందర్యం అనేది మనకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత. కాని అంగాలు అందరికి ఉంటాయి. వాటికి ఎ ప్రత్యేకతా ఉండదు. కాబట్టి ఇటు ఆస్వాదించే వాళ్ళు, అటు ప్రదర్శించే వాళ్ళూ అసలైన సౌందర్యాన్ని గుర్తించాలి.

8, డిసెంబర్ 2010, బుధవారం

డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు

'డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ' అని యండమూరి వీరేంద్రనాథ్ నవల దాదాపు తెలుగు వాళ్ళందరూ చదివే ఉంటారు. ఆ నవలనే 'చాలెంజ్' అనే సినిమాగా తీసారు. నవల చదవని వారు కూడా సినిమాను చూసుంటారు. ఎందుకంటేచిరంజీవి సినిమాల్లో అదొక సూపర్ హిట్ సినిమా. అందులో హీరో ద్వారా చట్టబద్దంగా డబ్బు సంపాదించడం ఎలాగోచెప్పారు యండమూరి. తెలియకో లేక కథ పరిమితుల మేరకో కొన్ని పద్ధతుల గురించే ఆయన అందులో ప్రస్తావించారు. కాని ఈరోజు దినపత్రికలు చదువుతుంటే మన రాజకీయ నాయకులకు 'చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం ఎలా?' అన్నదాని గురించి తెలిసినన్ని పద్ధతులు మహా మహా రచయితల ఊహలకు కూడా అందవంటే నమ్మి తీరాల్సిందే.

కోట్ల కొద్ది ప్రజాధనం పంచుకుంటుంటే చూస్తూ ఊరుకోడం తప్ప మనం ఎం చేయలేం. ఎందుకంటే అన్నీ చట్టబద్దంగాజరిగే దోపిడీలే. కేసు పెట్టడానికి వీల్లేని కేసులు. అవసరమైతే చట్టాలను కూడా మార్చుకుని మరీ చట్టబద్ధంచేసుకుంటున్న దోపిడీ అది. అందుకే నువ్విన్ని కోట్లు మింగావు అంటే , నువ్విన్ని మింగావు అని ఏకంగా అసెంబ్లీ లోనేకొట్టుకు సచ్చినా ఒక్క కోర్టు కూడా దానిని సుమోటోగా తీసుకోలేక పోయింది. ఒక్క పోలీసు స్టేషన్లో కూడా ప్రజా వాజ్యంనమోదు కాలేదు. అంత దాకా ఎందుకు సాక్షి పత్రిక చట్టబద్ధమైన స్తాపన గురించి పత్రికలన్నీ కథనాలను గుప్పించినానోరెల్లి పెట్టి చదివామే కాని ఎదురు ప్రశ్నించామా? చట్ట బద్దం మరి.

తాజాగా రాజా గారి మీద కేసులు పెట్టమని , నిర్వాకాల మీదా దర్యాప్తులు చేపట్టమని ప్రతిపక్షాల గోల. వాళ్ళకి తెలుసుకేసులు పెట్టినా ఒరిగేది ఏదీ ఉండదని. లాలూ, జయలలిత, మాయావతి, ఇత్యాది రాజకీయ నాయకుల మీద పెట్టినకేసులన్నిటిలోనూ జరిగిందేమిటి? అందరూ నిరపరాధులే. ఎటొచ్చీ ప్రజలే అపరాధులు. ఒక్క నాయకుడి నుంచి కూడామ్రింగిన కోట్లను కక్కించలేని దుర్భలురు.

25, నవంబర్ 2010, గురువారం

కూలి నెంబర్ వన్

అది హైదరాబాదు లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక బడాబాబు ఇల్లు.
''ఆ అమ్మాయినే చేసుకుంటానంటే నీకు ఈ ఆస్తిలో నయాపైసా కూడా ఇవ్వను!'' గద్దించాడు బడాబాబు.
''మరేం పరవాలేదు! నాకు ప్రేమ దొరికితే చాలు. అదే తింటాను. అదే తాగుతాను. అదే పీలుస్తాను. '' నిన్నే గర్ల్ ఫ్రండుతోఐమాక్స్ థియేటర్ లో చూసిన యూత్ సినిమాలోని డైలాగును ఉద్వేగంగా చెప్పాడు దొరబాబు.
''ఒరేయ్! డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినోడివి. ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం చాతకానోడివి. డబ్బు లేకుండా ఎలాబ్రతుకుతావురా?" బెదిరించే ప్రయత్నం చేసాడు బడాబాబు.
"నన్నేం బెదిరించక్కర లేదు. కూలి పని చేసుకు బ్రతుకుత."
"పిచ్చోడా! కూలి పని చేస్తావా? హ్హ హ్హా ! "
"ఎందుకంత ఎగతాళి? కావాలంటే కూలిపని చేసి రేపు ఈపాటికి పది లక్షలతో ఇంటికి వస్తా. నేనేంటో నిరూపిస్తా !"
ఆవేశంగా బయటకు వెళ్ళాడు దొరబాబు. కూలీ అన్న మాట వినను కూడా వినని కొడుకు ఈ చాలెంజి ఎలాచేసాడబ్బా...అని బుర్ర గోక్కుంటున్న బడాబాబు దృష్టి టేబుల్ పైన ఉన్న వార్తా పత్రిక పైన పడింది. 'కూలి చేసిపద్నాలుగు లక్షలు సంపాదించిన కేసీఆర్ .' అన్న హెడ్డింగు చూసి నవ్వుకున్నాడు బడాబాబు.
*******
అదే హెడ్డింగు చూసి ఇంకొకడు కూడా నవ్వుకున్నాడు. వాడెవడో కాదు! తరతరాల నుంచీ కూలీ బతుకీడుస్తూ ఈనాటికికూడా పూట గడవని స్థితిలో ఉన్న నిజమైన కూలీ.

4, నవంబర్ 2010, గురువారం

దీపావళి శుభాకాంక్షలు !

కాలుష్య రహిత దీపావళిని , కల్మషం లేని మనసుతో , కల్తీ లేని ఆనందంతో కాంతి భరితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ... మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

కాలుష్య రహిత దీపావళి - మామూలు రోజుల్లోనే వాతావరణ కాలుష్యం ఎక్కువ. ఇక దీపావళికి అది రెండు వందల శాతం ఎక్కువ కలుషితం అవుతుందని అంచనా. అందుకని టపాసులను ఎక్కువగా కాల్చకండి. వాయు కాలుష్యాన్ని పెంచాకండి. ఇక మామూలుగా మన చెవులకు అరవై దేసిబుల్స్ స్థాయి శబ్దాలు మాత్రమే అనుకూలం. అంతకు మించి స్థాయి గల శబ్దాలు రక్త పోటును పెంచి గుండెపోటుకు కారణం అవుతాయి. అందుకని పెద్దగా శబ్దం చేయని టపాసులను కాల్చండి.

కల్మషం లేని మనసు - టపాసులు కాలుస్తా .....చాలామంది డబ్బులు కాలిపోతున్నాయి అని భాధ పడుతూ ఉంటారు. కాని తప్పదు. పిల్లలు ఊరుకోరు కదా. దానికి మించి పొరుగువాడు కాలుస్తుంటే మనం కాల్చకపోవడం అనేది శ్రీమతికి నామోషి. అందుకని డబ్బులు తగలెయ్యడం అంటే టపాసులను కాల్చడం తప్పట్లేదని అనుకుంటూ బాధపడుతుంటారు. కాని ఒక్కసారి మీ పిల్లల ముఖాల్లోకి చూడండి. ఆ ఆనదాన్ని ఎంత డబ్బు పెట్టి కొనగలరు? దానితో పోలిస్తే మీరు తపసులకు తగలేసేది తక్కువే. కాబట్టి సంతషంగా పండుగ చేసుకోండి.
దీపావళి శుభాకాంక్షలతో ...